‘అతిథి దేవోభవ’ అన్నారు అతిథులు దేవుడితో సమానం ఎలా అవుతారు?
మాతృ దేవో భవ ! పితృదేవో భవ ! ఆచార్య దేవో భవ ! అతిథి దేవో భవ !
ఇవి గురువు చదువు పూర్తి చేసుకొని పోయే తన శిష్యుడికి చెప్పే మాటలు. కేవలం మాటలు కాదు ఆదేశాలు. అంటే ఆర్డర్స్. పాటించకపోతే గురు ధిక్కార పాపం వచ్చి చేరుతుంది.
వీటితో పాటు— యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. నో ఇతరాణి— అని గూడా గట్టిగా చెప్తాడు నాటి ఉపాధ్యాయుడు.
బాల్యం అంతా ఆయన చేతిలోనే నడిచింది. ఆయనే తల్లీ తండ్రీ
అందుకే తన దగ్గర పెరిగిన వాడు సర్వ విధాలా యోగ్యుడు కావాలి — అని ఈ వాత్సల్య పూరిత వచనాలు.
నలుగురిలో చెప్పుకోదగ్గ, నలుగురూ హర్షించే పనులు దేశకాలపాత్రాలు తెలుసుకొని చెయ్! వేరే ఏవీ చెప్పుకోలేని పరువుబోయే పనులు — న — వద్దు.
ఇదీ మన చదువు !
మాతృదేవో భవ అంటే —తల్లిని దేవుడితో సమానంగా చూడు …అని కాదు.
మాతృ దేవః = తల్లి దేవుడుగా కలవాడు. ( బహువ్రీహి సమాసం.)
దేవుడు , దేవత —రెండూ సమానార్థకాలు. (సంస్కృతంలో)
తల్లియే దేవత.
అలాగే మిగిలిన వాక్యాలున్నూ—
అతిథియే దేవుడు.
దేవుడికి చేసే షోడశోపచారాలూ అతిథికి చేయాలి. దైవం మానుష రూపేణ… భగవంతుడు అతిథి అర్చనతో సంప్రీతుడౌతాడు. అతిథుల సంప్రీతి వల్ల అభీష్టాలూ తీరుతాయి.
దుర్వాసుడు సంప్రీతుడై రుక్మిణీ దేవికి వరమిచ్చాడు. కృష్ణుడు వజ్ర కాయుడయ్యాడు. . కుంతీదేవి కోరకపోయినా దేవతానుగ్రహం పొందే మంత్రం ఇచ్చి వెళ్ళాడు.
గురుకులాలలో గూడా ఎవరైనా అతిథులు వస్తే శిష్టానధ్యయనం.. గురు శిష్యులు ఆ అతిథి సేవలో , ఆయన అభీష్టం నెరవేర్చడంలో లీనమై తమ నిత్య కృత్యాలనూ పక్కన పెడతారు.
జరాసంధుడు గూడా అతిథులుగా వచ్చిన శ్రీకృష్ణ భీములకు కయ్యపు భిక్ష ఇచ్చాడు. అతిథులుగా నీతో మల్ల యుద్ధం కావాలి అని కోరినా ఆ ఆతిథ్యం ఇచ్చాడతడు.
శకుంతల పరధ్యానంలో అతిథిసత్కార విధి విస్మరించి శప్త అయింది.
గృహస్థులందరూ అతిథులను ఆదరించాలి.. ఇది విధి.
అతిథిని ఆదరించక పోవడం ఆ ఇంటికి సెబ్బర.
ఈ నాటికీ మన దేశంలో అందరూ అతిథికి రాగానే తాగడానికి నీళ్లు ఇవ్వడం ఆచారం. అదే విధంగా తోచిన ఆహారం ఇవ్వడం.
మధ్యాహ్న వేళ ఐతే తప్పక భోజనంతో సంతృప్తుణ్ణి చేయడం మన ధర్మంగా పాటిస్తాం.
దేవతలు పరోక్ష ప్రియులు. వాళ్లు నేరుగా చేసే ఉపచారాల కంటే ప్రకృతిలో వాళ్లను దర్శించి అర్చించినపుడు అధికంగా సంప్రీతులౌతారు. అతిథి సేవ దైవ సేవయే.
గడపదొక్కి పెద్ద వాళ్లు ఎవరూ లోపలికి రారు..
వచ్చారంటే ఏదో కనబడని ఉపకారం కేవలం వాళ్ల రాక వల్లనే ఆ ఇంటికి జరుగుతుంది..
ఊరక రారు మహాత్ములు… అనే పద్యం ఈ అర్థంలో ఏర్పడినదే..
అతిథి దైవమే. * దైవం మానుష రూపేణ*— అంటాం.
అర్చనలకు సంప్రీతుడై భగవంతుడు ఒకరికి బుద్ధి పుట్టించి , ఆతని చేత సత్కార్యాలు చేయిస్తాడు
ఇది నా విధి అని—( ఆశలు పెట్టుకోకుండా ) భగవత్సేవ చేయాలి. తన వాడికి ఏది ఎపుడు తగినదో అపుడు ఆయనే ఇస్తాడు.
అదే విధంగా అతిథి సేవ చేస్తే తన అర్చనగా భగవంతుడు ఆనందిస్తాడు.
దుర్వాసుడే వచ్చి ఆతిథ్యం ఇమ్మని రుక్మిణీ కృష్ణులను అనేక చిత్ర విచిత్ర పరీక్షలకు గురిచేశాడు. ఒంటికంతా పాయసం పూయమన్నాడు. పరీక్షలో నెగ్గావు. నీ భర్త శరీరం వజ్రతుల్యం అయింది అని అనుగ్రహించాడు.. వీరుడు నిత్యమూ అనేక యుద్ధాలలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఒక ఇల్లాలికి అంతకంటే కావలసినదేమున్నది ?
ఆయనే కుంతి సేవలకు సంతోషించాడు. ఒక మంత్రం ఇచ్చాడు.
దేవతల అనుగ్రహంతో నీకు కోరినపుడు సంతానం కలుగుతుంది అని చెప్పాడు.
ధర్మాత్ములైన పుత్రులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన కారణంగా జన్మించారు.
మను చరిత్రలో బధిర, పంగు, అంధ, భిక్షుక , బ్రహ్మ చారి, జటి, పరివ్రాజక , అతిథి, క్షపణక , అవధూతలని — పెద్దన వేర్వేరుగా ఒక పెద్ద పట్టిక ఇచ్చాడు. వీళ్ళు అందరూ ఒకటే కాదు.
వచ్చిన వాళ్లను వాళ్ల అర్హత ఎరిగి , తదనుగుణంగా వాళ్ల ఆచారాలూ తెలుసుకొని ఆరాధించడం యజమాని విధి.
అందరికీ గృహస్థు సముచిత మర్యాద చేయవలె.

